ఇంఫాల్: మణిపూర్లో మొదలైన జాతుల ఘర్షణలు ఈశాన్యమంతా పాకుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లో మైనారిటీలుగా ఉన్న వర్గాలపై ఇతర సామాజిక వర్గాల వారు దాడులు చేసే అవకాశం ఉన్నదని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ మేరకు పీస్ అకార్డ్ ఎంఎన్ఎఫ్ రెటర్నీస్ అసోసియేషన్ (పీఏఎంఆర్ఏ) మైతీలను హెచ్చరించింది. ‘మణిపూర్లో మహిళలపై చోటుచేసుకున్న దారుణ ఘటనలకు ప్రతీకారంగా ఐజ్వాల్లోని మైతీలపై దాడులు జరిగే అవకాశం ఉన్నది’ అని పేర్కొంది. దీంతో అనేకమంది ఐజ్వాల్ విడిచి వెళ్లిపోయారు.
మరోవైపు మణిపూర్లో తాజాగా చురాచాంద్పూర్ జిల్లాలో ఆందోళనకారులు 10 ఇండ్లు, ఓ పాఠశాలకు నిప్పు పెట్టారు. వందల మంది మహిళలతో కూడిన ఓ గుంపు తోర్బంగ్ బజార్లో కాల్పులకు పాల్పడింది. మరోవైపు బీఎస్ఎఫ్ వాహనాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా, దళాలు ప్రతిఘటించడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. కాగా మణిపూర్లో ఇటీవల వైరలైన నగ్న ఊరేగింపు ఘటనలో 14 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు.