ఫరీదాబాద్: దేశంలో నకిలీ వైద్యుల ఆగడాలు మితిమీరుతున్నాయని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న వైద్యుడు కార్డియాలజిస్టుగా అవతారమెత్తడమే కాకుండా 8 నెలల్లో ఏకంగా 50కిపైగా గుండె శస్త్ర చికిత్సలు చేశాడు. విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు తమకు ఏమవుతుందోనని వణికిపోతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. నిందితుడు పంకజ్ మోహన్ శర్మ బాద్షాఖాఖాన్ సివిల్ దవాఖానాలోని హార్ట్‌కేర్ సెంటర్లో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
అతడు కార్డియాలజిస్ట్ కానప్పటికీ రోగులకు సర్జరీలు చేసి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం మొదలు పెట్టాడు. సంజయ్‌గుప్తా అనే లాయర్, సామాజిక కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు పంకజ్‌పై నిఘా పెట్టారు. మోహన్ అనే వైద్యుడి రిజిస్ట్రేషన్ నంబరైన 2456 చూపించి, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో నిందితుడు గుండె శస్త్ర చికిత్స నిపుణుడిగా మెడిటేరినా హాస్పిటల్లో నిరుడు జూలైలో విధుల్లో చేరినట్టు గుర్తించారు.
నిందితుడు తాను ప్రిస్క్రిప్షన్ రాసే చీటీల పైనా ఎండీకి సమానమైన ‘డీఎన్బీ’ (కార్డియాలజీ) చేసినట్టు రాసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి ఐఎంఏ నోటీస్ పంపింది. వైద్య డిగ్రీ సమర్పించాలని అతడు పనిచేసే దవాఖాన యాజమాన్యం అతడిని అడగడంతో నిందితుడు ఫిబ్రవరి నుంచి విధులకు హాజరు కాలేదు.