న్యూఢిల్లీ, మే 28: చిన్నారులకు ప్రాణాంతకంగా మారిన పోలియో వ్యాధి నివారణకు వేసే పోలియో
వ్యాక్సిన్‌కు మన దేశంలో కొరత ఏర్పడిందా?.. అంటే అవునని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఏటా నిర్వహించే జాతీయ పోలియో నివారణ దినాన్ని ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నోటి ద్వారా చిన్నారులకు అందించే పోలియో టీకా కొరత కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పల్స్ పోలియోలో భాగంగా ప్రభుత్వం ఏటా జాతీయ రోగ నిరోధకత పెంపు దినోత్సవం (ఎన్ఐడీ), ఉప రోగ నిరోధకత పెంపు దినోత్సవం(ఎస్ఎన్ఐడీ)లను నిర్వహిస్తోంది.
దానిలో భాగంగా 0-5 సంవత్సరాలు పిల్లలకు నోటి ద్వారా పోలియో చుక్కలను వేసేది. అయితే ఈ ఏడాది కావాల్సిన సంఖ్యలో పోలియో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో కేవలం ఎస్ఎన్ఐడీ కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించాలనుకుంటోంది. అది కూడా దేశంలోని 200 హై రిస్క్ జిల్లాలలో మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకోవాలని భావిస్తోంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లలో ప్రమాదకరమైన పోలియో వైరస్ 1, 2 విజృంభిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో టీకాలకు కొరత ఏర్పడటం ఆందోళనకరమని, కనీసం వాటిని దిగుమతి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.