జైపూర్: బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. (Vasundhara Raje’s convoy overturns) వెంటనే స్పందించిన ఆమె గాయపడిన పోలీసులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాజీ సీఎం వసుంధర రాజే ఆదివారం ఆ జిల్లాలోని బాలి గ్రామానికి వచ్చారు. మంత్రి ఒటారం దేవాసి తల్లి మరణంపై సంతాపం తెలిపారు. అనంతరం వసుంధర రాజే తన కాన్వాయ్‌లో తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, రోహత్, పానిహరి క్రాస్‌రోడ్ సమీపంలో బైక్‌ను తప్పించే క్రమంలో వసుంధర రాజే కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలోని నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఇది గమనించిన వసుంధర రాజే వెంటనే తన కారు ఆపించి కిందకు దిగారు. గాయపడిన పోలీసులను అంబులెన్స్‌లో బాలి ఆసుపత్రికి తరలించేందుకు ఆమె సహకరించారు. పాలి జిల్లా ఎస్పీ ఈ విషయాన్ని ధృవీకరించారు.