Saif Ali Khan | ముంబై, జనవరి 24(నమస్తే తెలంగాణ) : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తున్నది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పనిమనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్‌పై దాడి జరిగిందని కరీనా చెప్తూ వచ్చారు. దుండగుడిని గదిలో బంధించామని, తర్వాత అతడు తప్పించుకుపోయాడని పోలీసులకు చెప్పారు.
అయితే, పోలీసులు సీన్ రీ క్రియేట్ చేయగా.. ఘటన తీరుకు, సైఫ్ ఇంట్లో వాళ్లు చెప్తున్న సమాచారానికి పొంతన లేదని తెలుస్తున్నది. కరీనా, పని మనిషిని వేర్వేరుగా విచారించి, తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారి సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నటుడు సైఫ్‌పై దాడి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న బంగ్లా దేశీయుడి తండ్రి తన కొడుకును అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ విషయమై తాను తమ దేశ ప్రభుత్వాన్ని, ఢాకాలోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు.