ముంబై, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): పుణె భూ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగుచూడడంతో ఇందులో ప్రమేయం ఉన్నవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈ భూమికి 99 శాతం యజమాని అయిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ పేరును మాత్రం చేర్చలేదు. తన రాజీనామాపై ఒత్తిడి పెరుగుతుండడంతో వివాదాస్పద పుణె భూ లావాదేవీలను రద్దు చేసినట్లు అజిత్ పవార్ శుక్రవారం ప్రకటించారు.
పార్థ్థ్ పవార్, ఆయన బంధువు దిగ్విజయ్సిన్హ్ పాటిల్ రూ.1,800 కోట్ల మార్కెట్ విలువ చేసే 40 ఎకరాల భూమిని రూ. 300 కోట్లకు కొనుగోలు చేశారు. మహర్ వతన్గా పేరు పొందిన ఈ భూమి నిజానికి భూమిలేని దళిత రైతుల కోసం ఉద్దేశించినది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదేశాలపై పుణె భూ లావాదేవీలలో సంబంధం ఉన్న వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పుణె భూమికి 99 శాతం యజమానిగా ఉన్న పార్థ్ పవార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చని పోలీసులు కేవలం ఒక శాతం భూయజమానిగా ఉన్న దిగ్విజయ్సిన్హ్ పాటిల్ పేరును మాత్రం నమోదు చేయడం విశేషం. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.