Ranveer Allahbadia | న్యూఢిల్లీ: తల్లిదండ్రులపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రణ్వీర్ అల్లాబడియాపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ రియాల్టీ షోలో అల్లాబడియా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక పార్టిసిపెంట్ను అతడు తల్లిదండ్రులను ఉద్దేశించి అసభ్య, తీవ్ర అభ్యంతరకర ప్రశ్న అడిగాడు. ఇది వైరల్‌గా మారడంతో అతడిపై సోషల్ మీడియాలో, బయట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాక్స్వాతంత్య్రం పేరుతో హద్దులు దాటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
హాస్యం పేరుతో అసభ్యకర వ్యాఖ్యలను సహించవద్దని శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. వివిధ పార్టీల నేతలు అల్లాబడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై ముంబైలో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లాబడియాపై విచారణ జరపాలని కోరుతూ బాంద్రా కోర్టులో ఎన్ఎస్యూఐ ఫిర్యాదు చేసింది. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అల్లాబడియా క్షమాపణలు చెప్తూ ఓ వీడియో విడుదల చేశాడు.
బీర్బెసెప్స్ పేరుతో వీడియోలు చేసే రణ్వీర్ అల్లాబడియా(31)కు సోషల్ మీడియాలో దాదాపు 1.6 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఉత్తమ క్రియేటర్‌గా నేషనల్ క్రియేటర్ అవార్డును సైతం అందుకున్నాడు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకొని కొందరు కేంద్ర మంత్రులను సైతం అల్లాబడియా ఇంటర్వ్యూలు చేశారు.