PM Modi | అకోలా, నవంబర్ 9: మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఆ పార్టీ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంలుగా మారాయని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అకోలాలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
‘ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాజ కుటుంబానికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు ఏటీఎంలుగా మారిపోయాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నది. మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెప్తున్నారు. కర్ణాటకలోని లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.’ అని మోదీ ఆరోపించారు.
ఎన్నికల్లో గెలిచేందుకే ఇంత అవినీతా?
ఎన్నికల్లో గెలిచేందుకే కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఆ పార్టీ గెలిస్తే ఇంకెంత అవినీతి చేస్తుందో ఊహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం కానివ్వబోమని అన్నారు. మహా వికాస్ అఘాడీ అంటే అవినీతి, డబ్బు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చే వ్యాపారం చేసిందని దేశమంతా తెలుసని ఆరోపించారు. దళితుడు అయినందున, రాజ్యాంగాన్ని రచించిన కీర్తి దక్కినందుకే అంబేద్కర్ అంటే కాంగ్రెస్ రాజ కుటుంబానికి ద్వేషమని ఆయన పేర్కొన్నారు.
ఓబీసీలు, దళితులు, ఆదివాసీల మధ్య గొడవపెట్టి ఓట్లు దండుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచన అని అన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రం కొత్త ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకలో ఇటీవల మద్యం వ్యాపారుల సంఘం ఎక్సైజ్ శాఖపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసింది. బార్ లైసెన్సులు ఇవ్వడానికి భారీగా లంచాలు తీసుకుంటున్నారని, రూ.700 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే.