PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ జులై 23-24 తేదీల్లో బ్రిటన్లో పర్యటించనున్నారు. ఇది మోదీకి నాల్గో అధికారిక పర్యటన కానున్నది. అనంతరం ప్రధాని మోదీ జులై 25-26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మోయిజు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ మాల్దీవుల పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇది ఆయనకు మూడో మల్దీవుల పర్యటన. అధ్యక్షుడు మోయిజు మాల్దీవుల్లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన ఒక విదేశీ దేశాధినేత తొలి పర్యటన కానున్నది. యూకే పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరుగనున్నాయి.
ప్రధానమంత్రి మోదీ తన యూకే పర్యటన సందర్భంగా కింగ్ చార్లెస్-3ను సైతం కలిసే అవకాశం ఉన్నది. రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, పురోగతిపై చర్చించనున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణ, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చలుంటాయి. జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. వివిధ అంశాలపై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజుతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్-మాల్దీవులు ఉమ్మడి ఆర్థిక, సముద్ర భద్రతా ఒప్పందంపై పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షిస్తారు. 2024 అక్టోబర్లో మొహమ్మద్ మొయిజు భారతదేశాన్ని సందర్శించినప్పుడు రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.