Modi : రాజకీయ నేత ఏది చేసినా రాజకీయమే. ప్రతి కదలికా ఓ రాజకీయ కోణమే. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వస్త్రధారణ గురించే చర్చ జరిగింది. గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ బ్రహ్మకమలం చిత్రంతో వున్న ఉత్తరాఖండ్ టోపీని ధరించారు. మణిపూర్ సంప్రదాయానికి చెందిన కడువాను మెడలో వేసుకున్నారు. అటు ఉత్తరాఖండ్ టోపీ, ఇటు మణిపూర్ కండువా.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మోదీ వస్త్రధారణ వార్తల్లోకెక్కింది.
ఇది జరిగి సరిగ్గా మూడు రోజులు గడిచిందోలేదో… ప్రధాని మోదీ ఇప్పుడు నెత్తికి సిక్కు టర్బన్ ధరించి ఎన్సీసీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పంజాబ్లో కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. నెత్తికి టర్బన్ ధరించి, ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. ఆ తర్వాత ఎన్సీసీ క్యాడెట్లు చేసిన విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ… ఈ కార్యక్రమం జరుపుకోవడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. ‘నేనూ మీలాగే ఎన్సీసీ యాక్టివ్ క్యాడెట్ అయినందుకు గర్వపడుతున్నా. ఎన్సీసీలో నేను పొందిన శిక్షణ, నేర్చుకున్నది ఈ రోజు దేశం పట్ల నేను నిర్వర్తిస్తున్న విధుల్లో ఆ శిక్షణ తోడ్పాటునిస్తోంది. బలాన్నిస్తోంది.’ అని మోదీ పేర్కొన్నారు.