న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రజలకు ప్రధాని మోదీ మరోసారి కీలక విజ్ఞప్తి చేశారు. అవసరం లేకపోతే బంగారం కొనకూడదు అని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో పిలుపునిచ్చారు. మే 11న కూడా ప్రధాని ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. ప్రజల సంకల్ప బలాన్ని, కఠోర శ్రమను కూడా మోదీ ప్రశంసించారు. ఇది మన సామూహిక శక్తిని నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రపంచమంతా యుద్ధాలతో చుట్టుముట్టి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని కొందరు వ్యక్తులు అబద్ధాలను ఉపయోగించి నిరాశను వ్యాప్తి చేయడానికి, వాతావరణాన్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ ఆరోపించారు. విదేశీ యాత్రలు వద్దు సెలవుల కోసం విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో వివాహాలు చేసుకోవడం వంటివి ప్రజలు మానుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు మేక్ ఇన్ ఇండియా మంత్రంతో ముందుకు సాగాలని, అవసరం లేకపోతే ప్రజలు బంగారం కొనకూడదని ఆయన అన్నారు.
ఉగ్రవాదం వ్యూహాత్మక ఆస్తిగా ఉండలేదు
ఉగ్రవాదం వ్యూహాత్మక ఆస్తిగా ఉండలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) 26వ శిఖరాగ్ర సమావేశంలో మంగళవారం ఆయన ఉగ్రవాదంపై సభ్య దేశాలకు ఒక బలమైన సందేశాన్ని అందజేశారు. మొత్తం ఉగ్రవాద వ్యవస్థను నాశనం చేయాలని పిలుపునిచ్చిన ఆయన ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘ఎంతో తీవ్రమైన ఈ సమస్యపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు. మనమంతా ఏకస్వరంతో మాట్లాడాలి. ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా వినియోగిస్తున్న కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ దానికి ఊతం కల్పిస్తున్నాయి. ఉగ్రవాదం వ్యూహాత్మక ఆస్తిగా ఉండలేదన్న సందేశాన్ని ఆ దేశాలకు పంపాలి’ అని ఆయన పేర్కొన్నారు.