న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర రీపేమెంట్ ప్లాన్‌కు బ్రేకులుపడ్డాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) చరిత్రలోనే తొలిసారి ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం.. మునుపటి ఆదేశాలపై స్టే విధించింది. రూ.22,006 కోట్ల బకాయిలకుగాను కేవలం రూ.6.5 కోట్లనే చెల్లిస్తానంటూ ముందుకొచ్చిన సుభాష్ చంద్ర కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా జరిగిన ఓటింగ్‌లో 23 మంది క్రెడిటర్లు (అప్పులిచ్చినవారు) పాల్గొనగా.. దాదాపు 81 శాతం అనుకూలంగా, 19 శాతం వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ శాతాన్నిబట్టి రిజల్యూషన్ ప్లాన్‌ను గత నెల 25న ఎన్సీఎల్టీ నీలేశ్ శర్మ ధర్మాసనం ఆమోదించింది.
దీంతో ప్లాన్‌కు అంగీకరించిన క్రెడిటర్లలో సుభాష్ చంద్ర, ఆయన బంధువులు, సహచరులకు చెందిన సంస్థలున్నాయని, వాటి ఓటింగ్ వాటా సుమారు 65 శాతం వరకు ఉంటుందని హెచ్డీఎఫ్సీ, కెనరా, యూనియన్ బ్యాంకులతోపాటు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తదితర సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గత ఆదేశాలను ఎన్సీఎల్టీ అధ్యక్ష న్యాయమూర్తి అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నాయకత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఆస్తులను బదిలీ చేయరాదని ఉత్తర్వులిచ్చింది. రీపేమెంట్ ప్లాన్‌పై స్పష్టమైన మెజారిటీ కనిపించట్లేదని, అందుకే తీర్పు చెల్లదని పేర్కొన్నది. అలాగే ఈ కేసులోని అన్ని పార్టీలకు నోటీసులిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఇక ఈ కేసులో రిజల్యూషన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న బ్యాంకర్ల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా వాదిస్తుండగా.. ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)కూ చేరింది.