Ayodhya | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అయోధ్యలో పర్యటించనున్నారు. రామజన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆలయం శిఖరాలపై జెండాలను ఎగుర వేయనున్నారు. అనంతరం ఈ కార్యక్రమం రామమందిరం నిర్మాణంలో కీలకమైన మైలురాయిగా నిలువనున్నది. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటన దాదాపు మూడు గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రధాని మొదట బాల రాముడిని దర్శించుకొని, హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ పర్యటన సందర్భంగా శ్రీరామ్ దర్బార్‌లో ప్రతిష్టించిన విగ్రహాల ఎదుట జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, పూజలు చేస్తారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు మిశ్రా చెప్పారు. ఆధ్యాత్మికంగా వాతావరణం కనిపించేలా ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, వాస్తుశిల్ప అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆలయ మ్యూజియం అభివృద్ధి, సాంకేతిక రూపకల్పనను చెన్నైలోని భాగస్వామ్య సంస్థ పరివర్తన్కు అప్పగించినట్లు చెప్పారు. జెండా ఎగుర వేసే కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల మధ్య జరుగుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక సహకారంతో ‘ఓం’ చిహ్నంతో తయారు చేసిన కాషాయ రంగు జెండాలను భక్తుల సమక్షంలో ఎగుర వేస్తారు.