న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 14న ప్రధాని మోదీ ఇటలీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన జీ7 సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇటలీ పీఎం జార్జియా మెలోని గత ఏప్రిల్ నెలలో ప్రధాని మోదీని ఆహ్వానించారు. దీనికి సమ్మతించిన ఆయన మెలోనికి కృతజ్ఞతలు కూడా తెలిపిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సదస్సుకు జీ20 ఫోరమ్‌లోని దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కూడా హాజరుకానున్నాయి. సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోదీ సమావేశమయ్యే అవకాశం ఉన్నది. కాగా, ఈ నెల 15న స్విట్జర్లాండ్‌లో ఉక్రెయిన్ శాంతి సమావేశం జరుగుతున్నది. దానికి మోదీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే జూన్ 14న జీ7 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని.. వెంటనే భారత్‌కు తిరిగిరానున్నారు.