PM Modi : పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల (Monsoon Session) ప్రారంభం సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మీడియాతో మాట్లాడారు. ఈ వర్షాకాలం, అలాగే పార్లమెంట్ సమావేశాలు రెండూ దేశానికి ఫలప్రదంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దేశ యువత సాధిస్తున్న అద్భుత విజయాలను కొనియాడుతూ వారి సామర్థ్యం, ఆకాంక్షలు అంతరిక్షం వలె అనంతమైనవని ప్రశంసించారు.
“వర్షాకాలం అయినా, వర్షాకాల సమావేశాలైనా రెండూ చాలా ఫలప్రదమైనవి. ఈ రెండూ ఫలవంతంగా సాగినప్పుడు దేశ సంక్షేమానికి, సర్వ జీవుల సంక్షేమానికి మేలు జరుగుతుంది. అందుకే ఈసారి కూడా రెండూ సఫలం కావాలని కోరుకుంటున్నా” అని ప్రధాని అన్నారు. గత నెలలో దేశం జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రంగాలలో అనేక మైలురాళ్లను అధిగమించిందని, ఈ విజయాల పరంపర దేశ పౌరులలో గర్వాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు.
అంతరిక్ష రంగంలో యువత సాధిస్తున్న విజయాలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఏడాది వర్షాకాల సమావేశాలకు ముందు ఒక భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున్నారని గుర్తుచేశారు. ఈసారి హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అనే సంస్థ ‘మిషన్ ఆగమన్’ కింద దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ను విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు.
స్కైరూట్‌లో పనిచేస్తున్న యువత సగటు వయసు కేవలం 28 సంవత్సరాలని చెప్పారు. తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు, 28 ఏళ్ల సగటు వయసున్న యువత గురించి మాట్లాడుతున్నానని పరోక్షంగా రాహుల్‌గాంధీని ఎద్దేవా చేశారు. స్కైరూట్ యువత అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని సగర్వంగా ఎగరవేశారని మోదీ అన్నారు. భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ఆమోదం పొందుతోందని అన్నారు.