హైదరాబాద్, అక్టోబర్ 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలకు గుజరాత్ ‘రోల్ మాడల్’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తరుచూ వల్లె వేస్తారు. అయితే, గుజరాత్ మాడల్.. ఓ మేడి పండు అని ఇప్పటికే పలు ప్రగతిశీల సూచీలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో భారీఎత్తున నిధులు గోల్మాల్ అయినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని 8 మునిసిపల్ కార్పొరేషన్లలో నిధుల వ్యయానికి సంబంధించిన లెక్కల్లో స్పష్టత కొరవడింది. నిధుల ఖర్చులో ఆర్థిక పారదర్శకత, వ్యవస్థాగత నిర్లక్ష్యం, ఉల్లంఘనలు జరిగినట్టు తెలిసింది. గడిచిన ఏడేండ్లుగా ఆయా మునిసిపాలిటీల్లో ఆడిటింగ్ అనేదే జరుగలేదని తేలింది. ఈ మేరకు హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ హేమంత్ కుమార్ షా సమాచారహక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం స్పందించింది.
ప్రజలు చెల్లించే పన్నులతో మునిసిపల్ కార్పొరేషన్లు నగరాభివృద్ధి పనులను చేస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసిన ప్రతీ పైసాను అధికారులు రికార్డుల్లో నమోదు చేయాలి. ఈ వ్యయం సక్రమంగా జరిగిందా? లేదా? అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లేదా లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసు అధికారులు ప్రతీ ఏటా ఆడిటింగ్ నిర్వహించాలి. అప్పుడే పౌరులు కట్టిన ప్రతీ రూపాయికి జవాబుదారీతనం ఉంటుంది. అయితే, గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, జునాగఢ్, సూరత్, వడోదరా మునిసిపల్ కార్పొరేషన్లలో గడిచిన కొన్నేండ్లుగా ఆడిటింగ్ ప్రక్రియ జరుగట్లేదు. దీంతో ఈ కాలంలో ఖర్చు చేసిన రూ. 2 లక్షల కోట్ల ప్రజాధనం ఎందుకు? ఏయే పనులకు? ఖర్చు చేశారన్న విషయంలో స్పష్టత కొరవడింది.
మునిసిపల్ కార్పొరేషన్ల నిధుల ఖర్చుకు సంబంధించి సాధారణంగా ప్రతీఏటా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అయితే, గత కొన్నేండ్లుగా ఇది జరుగట్లేదు. దీంతో హక్కుల కార్యకర్త హేమంత్ కుమార్ షా సమాచారహక్కు చట్టం ద్వారా ఈ మేరకు ప్రశ్నించారు. హేమంత్ ప్రశ్నకు స్పందించిన సంబంధిత అధికారులు.. అహ్మదాబాద్, సూరత్, వడోదర మునిసిపాలిటీలో గడిచిన ఏడేండ్లుగా, రాజ్‌కోట్‌లో గడిచిన ఆరేండ్లుగా, జామ్‌నగర్, భావ్‌నగర్‌లో ఐదేండ్లుగా, గాంధీనగర్, జునాగఢ్ మునిసిపాలిటీలో గడిచిన నాలుగేండ్లుగా ఆడిటింగ్ నిర్వహించలేదని జవాబిచ్చారు. అంటే, ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఈ వ్యవధిలో ఖర్చు చేసిన దాదాపు రూ. 2 లక్షల కోట్ల నిధులు పారదర్శకంగా ఖర్చు చేశారో లేదో తెలియదన్నమాట. దీంతో నెటిజన్లు గుజరాత్ మాడల్‌పై విమర్శలు వ్యక్తం చేశారు. గుజరాత్ రోల్ మాడల్ కాదు.. లూట్ మాడల్ అంటూ మండిపడ్డారు.