న్యూఢిల్లీ, నవంబర్ 17: డీప్‌ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో ప్రధాని మోదీ చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ఈ విధంగా దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమన్నారు. బీజేపీ దీపావళి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో హల్చల్ చేసే ఇలాంటి వీడియోలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలని చాట్‌జీపీటీని కోరినట్టు తెలిపారు. ‘నేను గార్బా నృత్యం చేస్తున్నట్టున్న వీడియో ఒకటి చూశాను.
నేను బడిలో చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గార్బా ఆడలేదు’ అని మోదీ తెలిపారు. ఇలాంటి వీడియోలు అనేకం ఉన్నాయని, వీటి మీద ప్రజలను చైతన్యవంతం చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. నటీమణులు రష్మిక, కత్రినా, కాజోల్ డీప్‌ఫేక్ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.