2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధినేత, తన ఆప్త మిత్రుడు అదానీని ప్రధాని మోదీ రక్షిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో అదానీకి సమన్లు జారీ చేయాలంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ)11 నెలలుగా పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా మోదీ సర్కారు పెడచెవిన పెట్టడాన్ని పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తున్నది. సమన్ల జారీకి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు ఎస్ఈసీ శుక్రవారం వాపోయింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా భారత అధికారుల నుంచి కనీస స్పందన కూడా రాలేదని అసహనం వ్యక్తంచేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని కాపాడటం కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) విజ్ఞప్తులను కూడా మోదీ ప్రభుత్వం పక్కనబెట్టిందా? రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీని కాపాడేందుకు స్వయంగా మోదీనే రంగంలోకి దిగారా? గౌతమ్ అదానీకి సమన్లు జారీ చేయాలంటూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 నెలలుగా అర్థిస్తున్న ఎస్ఈసీ విజ్ఞప్తులను కూడా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తున్నది.
సెక్యూరిటీల మోసం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి సమన్లు జారీ చేయడానికి భారత్‌లోని మోదీ సర్కారు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభించడం లేదని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) శుక్రవారం వాపోయింది. సమన్ల జారీకి భారత అధికారుల నుంచి సహాయం కోసం గడిచిన 11 నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని, నోటీసుల జారీలో సాయం చేయాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. వారి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదని అసహనం వ్యక్తం చేసింది.
హేగ్ సర్వీస్ ఒప్పందం ప్రకారం.. ఏదైనా కేసు విషయంలో భారత్‌లో నివసిస్తున్న ప్రతివాదులకు సమన్లు ఇవ్వాలంటే ఆ సమన్లతో పాటు ఫిర్యాదు ప్రతిని కూడా జారీచేయాల్సి ఉంటుందని ఎస్ఈసీ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేసింది. ఈ కేసులో ప్రతివాదులకు (గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ) సమన్లు, ఫిర్యాదును అందచేయడానికి భారత న్యాయ మంత్రిత్వశాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది. 2021 సెప్టెంబర్‌లో రుణాలు పొందే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ తప్పుడు ప్రకటనలు చేశారని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే 2024 నవంబర్ 20న ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించారని అదానీపై ఆరోపణలు చేసింది.
కాగా.. సివిల్ ప్రొసీజర్‌కి చెందిన ఫెడరల్ నిబంధనల్లోని 4(ఎఫ్) కింద ప్రతివాదులు కోర్టులో తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అదానీకి సమన్లు జారీ చేయడానికి భారత న్యాయ మంత్రిత్వశాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది. అయితే, కేసు నమోదు చేసి 11 నెలలు గడిచినా భారత్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వాపోయింది. అదానీలు, వారి న్యాయవాదులకు తమనుంచైతే లా సూట్, సమన్లు, ఫిర్యాదు ప్రతులను గత ఆగస్టుతో పాటు సెప్టెంబర్ 14న కూడా పంపించినట్లు కోర్టుకు సమర్పించిన తాజా స్టేటస్ రిపోర్టులో ఎస్ఈసీ పేర్కొంది.
తాము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భారత న్యాయ మంత్రిత్వశాఖ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని ఎస్ఈసీ వాపోయింది. కోర్టులో గతంలో మూడుసార్లు స్టేటస్ రిపోర్టులు దాఖలు చేసిన ఎస్ఈసీ.. తాము అన్ని మార్గాల ద్వారా ప్రతివాదులకు సమన్లు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే, భారత న్యాయ మంత్రిత్వశాఖ నుంచి మాత్రం సహకారం రావడం లేదని నిస్సహాయతను వ్యక్తం చేసింది.
అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించట్లేదని ఎస్ఈసీ ఆరోపించడంపై రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున దుమారం రేగుతున్నది. బొగ్గు గనుల నుంచి పోర్టుల వరకూ, రిటైల్ వ్యాపారం నుంచి విమానాశ్రయాల వరకూ మొత్తంగా దేశాన్నే అదానీకి గంపగుత్తగా కట్టబెట్టిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాలో దాఖలైన కేసు నుంచి అదానీని తప్పించడానికి ఇలా చేస్తున్నదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్.. అమెరికాకు అప్పగించాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు.
ఈ మేరకు ఇండియా-అమెరికా మధ్య వాషింగ్టన్లో జూన్ 25, 1997లో జరిగిన నేరస్తుల అప్పగింతల ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికాలో నమోదైన అభియోగాలు నిరూపితమైతే నిందితులు అక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేరం రుజువైతే అదానీని అమెరికాకు పంపించాల్సిందేనని న్యాయకోవిదులు చెప్తున్నారు. అందుకే, అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అదానీని కాపాడేందుకే, మోదీ ప్రభుత్వం ఇలా చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచ దేశాలు పునరుత్పాదక శక్తి రంగంవైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్తు రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ. 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు ఎఫ్‌బీఐ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్లను లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఎఫ్‌బీఐ, ఎస్ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు ఎస్ఈసీ ఆరోపించడం గమనార్హం.
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్ మ్యానిప్యులేషన్ జరిగినట్టు సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై అమెరికాలోని బ్రూక్లిన్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. ఈక్రమంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొందరు న్యాయవాదులకు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్టు అనుమానాలు వచ్చాయి. దీంతో వాళ్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు అమెరికాలోని మీడియా తెలిపింది.
ఎఫ్‌బీఐ అభియోగాల్లో పేర్కొన్న 8 మంది నిందితుల్లో నలుగురికి అమెరికా పౌరసత్వం ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ స్కామ్‌లో అమెరికా ఇన్వెస్టర్లు, అమెరికా బ్యాంకుల నిధులు ఉన్నాయి. నిందితుల జాబితాలోని అజురా పవర్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయ్యి ఉన్నది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను అమెరికా కోర్టు ప్రారంభించింది.
అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడినట్టు తేలితే అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ప్రకారం.. గౌతమ్ అదానీకి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు 2008నాటి సీమెన్స్ ఏజీ, 2012లో ఎలీలిల్లీ కంపెనీ కేసులను ఉదహరిస్తున్నారు.