న్యూఢిల్లీ, జూలై 1: నిర్బంధంలోకి తీసుకున్న మంత్రులను పదవి నుంచి తొలగించాలని కోరే వివాదాస్పద 30వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఈ నెల 17న తన నివేదికను ఆమోదించనున్నది. తీవ్రమైన నేరాలకు సంబంధించి అరెస్టయి వరుసగా 30 రోజులపాటు కస్టడీలో ఉన్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు లేదా ఇతర మంత్రులను పదవి నుంచి ఎవరి ప్రమేయం లేకుండా తొలగించాలని ప్రతిపాదించే అత్యంత వివాదాస్పద నిబంధనను ఈ నివేదికలో అలాగే కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కక్షసాధింపు కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు కొన్ని సూచనలు కూడా ఇందులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జూలై 20 నుంచి ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి, ఆమోదించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఏడాది ఆగస్టులో ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిని పరిశీలించడానికి అపరాజిత సారంగి అధ్యక్షతన 31 మంది సభ్యులతో కూడిన జేపీసీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌సహా విపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు సభ్యులు ఈ జేపీసీని బహిష్కరించారు.