న్యూఢిల్లీ: ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లులను విస్తృత సంప్రదింపుల నిమిత్తం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసే అవకాశం ఉన్నది. అలాగే జమ్ము కశ్మీరుకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 1949 నుంచి జమ్ము కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణలను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసి జమ్ము కశ్మీరు, లద్దాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్ము కశ్మీరుకు శాసనసభను కల్పించి లద్ధాఖ్‌కు కల్పించలేదు.
భారత వాయుసేన కోసం 62 వేల కోట్లతో 97 తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేయనుంది. 48 వేల కోట్లతో 83 తేజస్ జెట్ల కొనుగోలు కొన్నేండ్ల క్రితమే కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.