దేశంలో ఏ ఇద్దరు పౌరులు కలుసుకొన్నా.. ప్రస్తుతం చర్చించుకొంటున్న అంశం ‘మణిపూర్’. గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలు యావత్తు ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఎస్టీ హోదా విషయంలో రెండువర్గాల మధ్య మొదలైన నిరసనలు జాతుల మధ్య వైరంగా మారింది. మణిపూర్ హింస వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న విమర్శలు వెలువడుతున్న సమయంలో కొత్తగా మరో కోణం ఉన్నదన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, (నమస్తే తెలంగాణ), జూలై 28: హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతున్నది. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇచ్చే అంశంపై మే 3న మొదలైన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన వాదమే మణిపూర్ అగ్నిగుండంగా మారడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న సమయంలో కార్పొరేట్ల ధనదాహం కూడా ఈ హింసకు ఆజ్యం పోసినట్టు కొత్తగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మణిపూర్లో 90 శాతం అడవులు, కొండలే. ఇక్కడ కుకీ, నాగా ప్రజలు వందల ఏండ్లుగా నివసిస్తున్నారు. ఇక్కడి కొండలు, గుట్టల్లో నికెల్, కాపర్, ప్లాటినం తదితర విలువైన ఖనిజాలు అపారంగా ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. సెక్షన్ 42, ఎస్సీ, ఎస్టీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చట్టాల కారణంగా ఈ ప్రాంతాలను కొనుగోలు చేయడం ఇతరులకు సాధ్యంకాదు. అయితే, ఎస్టీ హోదా కలిగిన వారు మాత్రం గిరిజనుల నుంచి భూములను కొనుగోలు చేయవచ్చన్న మినహాయింపు ఉన్నది. దీంతో ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి వచ్చిన మైతీల్లోని కొందరు బీజేపీ నేతలు తమ వర్గానికి ఎస్టీ హోదా కోసం చిచ్చు రాజేసినట్టు సమాచారం. మైతీలకు ఎస్టీ హోదా వస్తే, కుకీల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నట్టు వాదనలున్నాయి. ఈ హింసాత్మక ఘటనలకు ఇదే కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ మే తొలివారంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య జరిగిన అల్లర్లుగా పైకి కనిపిస్తున్నప్పటికీ, ఈ హింసాకాండ వెనుక.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విభజన వాదమే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ మత చిచ్చు రాజేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మణిపూర్ జనాభాలో 53 శాతం ఉన్న మైతీలు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కుకీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మే 3న రెండు జాతుల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. పదుల సంఖ్యలో చర్చిలు దహనమయ్యాయి. ఈ ఘర్షణలకు బీజేపీ మతోన్మాద రాజకీయాలే కారణంగా తెలుస్తున్నది.