కోర్ఫు: గ్రీస్‌లోని కోర్ఫు నుంచి జర్మనీలోని డస్సెల్డోర్ఫ్కు బయల్దేరిన కొండోర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. ఈ నెల 16 రాత్రి 8 గంటలకు బయల్దేరిన ఈ విమానంలోని కుడివైపుగల ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గాల్లో ఎగురుతుండగానే ఈ సంఘటన జరిగింది. పోర్టు ప్రాంతం గుండా 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పేలుడు వంటి శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదానికి గురైన ఇంజిన్‌ను సిబ్బంది వెంటనే నిలిపేశారు. కోర్ఫు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ సర్వీసులు అప్రమత్తమయ్యాయి. అయితే, పైలట్లు దీనిని ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. దీనిలోని 273 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందికి దిగిపోయారు. వీరికి హోటల్లో వసతి కల్పించారు. కొండోర్ ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో, బోయింగ్ 757-330 విమాన ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.