న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సుప్రీంకోర్టులో దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ పినాక పాణి మొహంతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జీవించి లేని నేతలపై నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఆరోపణలు చేశారని, మహాత్మా గాంధీని కూడా విడిచిపెట్టలేదని మండిపడింది.
తాను వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (ఇండియా) కటక్ జిల్లా కార్యదర్శినని పినాక పాణి ఈ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, “మీ వెనుక ఎవరున్నారు? సమాజానికి, మరీ ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం మీరు ఏం చేశారు? మీ చిత్తశుద్ధిని పరీక్షించాలి. నాలుగు వారాల్లోగా ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి” అని పిటిషనర్‌ను ఆదేశించింది.