ICRISAT | సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నీరు లేక నెర్రలు తీసిన బుందేల్ ఖండ్ భూములు ఇప్పుడు జల కళను సంతరించుకుంటున్నాయి. వట్టిబోయిన వ్యవసాయ బావులు, 50 అడుగుల లోతులోకి వెళ్లినా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నడుమ కునారిల్లే చెరువులు, కుంటలలో నేడు ఇక్రిసాట్ జల సిరులు కురిపించింది. వారు చూపిన ల్యాండ్ మేనేజ్మెంట్ విధానాలు ఆ ప్రాంతంలో జల వనరులను వృద్ధి చేశాయి.
యూపీలోని బుందేల్ఖండ్ కొండ ప్రాంతాలను ఇక్రిసాట్ భూగర్భ జల వనరులను మెరుగుపరిచేలా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని అమలు చేసింది. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం, ఇంకుడు గుంతలు, అదే విధంగా కెనాళ్ల ద్వారా నీరు చెరువుల్లోకి వెళ్లే విధంగా సహజ నీటి ప్రవాహానికి వీలుగా నిర్మాణాలను చేపట్టారు. దీంతో వట్టిపోయిన వ్యవసాయ భూముల్లోకి నీరు రావడం మొదలైంది. ముఖ్యంగా భూగర్భ జలాల నీటి మట్టం పెరగడంతో ఇప్పుడు సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైనా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని ఇక్రిసాట్ వర్గాలు తెలిపాయి.