Diabetes | న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశంలో మధుమేహం, దాని అనుబంధ రోగాలు ఆందోళకర స్థాయిలో పెరగడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఈ నెల 27న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తక్కువ పోషకాలు, పరిమితికి మించిన చక్కెర, ఉప్పు, నూనె ఉన్న ప్యాకేజ్డ్ ఆహారంపై వాటి వివరాలతో కూడిన ముందు వైపు లేబిలింగ్(ఎఫ్ఓపీఎల్) నిబంధన అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈ పిల్ దాఖలైంది. దీని వల్ల ప్రజలు సులువుగా పోషక విలువలు, హానికర పదార్థాల సమాచారాన్ని తెలుసుకుంటారని పిటిషనర్ తెలిపారు. మధుమేహం చాప కింద నీరులా దేశంలో వ్యాపిస్తున్నదని, లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్న ఈ వ్యాధి మన ఆరోగ్య వ్యవస్థపై పెను భారాన్ని మోపుతున్నదని పిల్ వేసిన 3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ ఎన్జీవో తెలిపింది. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహంతో బాధ పడుతున్నారని.. ఇది స్థూలకాయానికి దారి తీస్తుందని వెల్లడించింది.
న్యూఢిల్లీ: నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది. తాము వెళ్లడానికి తీవ్ర అసౌకర్యంగా ఉండే నగరాల్లో తమకు పరీక్ష కేంద్రాలను కేటాయించారని పిటిషనర్ ఆరోపించారు. విశాల్ సొరేన్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు.