PIB Fact Check | జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని భారత్ కొట్టిపారేసింది. దేశంలోని ఏ ఆర్మీ కంటోన్మెంట్‌లోనూ ఆత్మాహుతి దాడులు జరగలేవని పీఐబీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించే, గందరగోళానికి దారితీసే ఇటువంటి నకిలీ వార్తల ఉచ్చులో పడవద్దని హెచ్చరించింది.
అలాగే పాకిస్థాన్‌లోని నీలమ్ జెలుం హైడ్రో పవర్ ప్రాజెక్టుపై భారత్ దాడికి తెగబడిందన్న వార్తలను కూడా పీఐబీ ఖండించింది. ఆ వార్తలన్నీ నిరాధారమని స్పష్టం చేసింది. ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత్ దాడులకు పాల్పడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిష్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారని వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌పై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. గురువారం రాత్రి సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు ప్రయోగించింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్‌ను విరోచితంగా కూల్చివేసింది. అలాగే రాజస్థాన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూడా కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రెండు జేఎఫ్17 యుద్ధ విమానాలను సైతం కూల్చివేసిందని సమాచారం. అయితే ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వెల్లడించింది.