పాట్నా: పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో మంత్రి ఫొటో మిస్ అయ్యింది. (Minister Photo Missing) దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో తాను లేనని మీడియాతో అన్నారు. పార్టీలో దీనిపై చర్చ జరుగడంతో తాను ఎగతాళిగా అన్నట్లు తర్వాత వివరణ ఇచ్చారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఫీస్ బేరర్లతో సీనియర్ జేడీ(యూ) నేతల సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసే వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా, జేడీ(యూ) కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో సీఎం నితీశ్ కుమార్, పార్టీ మంత్రుల ఫొటోలతో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే జేడీ(యూ) సీనియర్ నేత, 1990 నుంచి సుపాల్ ఎమ్మెల్యేగా గెలిచిన ఇంధనం, ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఫొటో ఈ పోస్టర్లు, బ్యానర్లలో కనిపించలేదు. అలాగే 77 ఏళ్ల వయస్సున్న ఆయనను చివరి నిమిషంలో పార్టీ సమావేశానికి ఆహ్వానించారు.
మరోవైపు సీనియర్ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నన్ను సమావేశానికి ఎందుకు ఆహ్వానిస్తారు? జేడీ, జేడీ(యూ)లో నేను లేనుగా’ అని మీడియాతో అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తాను కేవలం హాస్యాస్పదంగా ఈ మాట అన్నట్లు అనంతరం వివరణ ఇచ్చారు. తాను పార్టీలోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పోరాడుతామని అన్నారు.