ముంబై : టాటా సంస్థ అధినేత రతన్ టాటా(Ratan Tata) కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. దాతృత్వానికి పేరుగాంచిన ఆయన.. తన పెంపుడు శునకం టీటోకు భారీగా సంపదను రాసిచ్చినట్లు ఆయన వీలునామా ద్వారా తెలుస్తోంది. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. రతన్ టాటా తన ఆస్తులను అనేక మందికి దానం చేశారు. టాటా ఫౌండేషన్, సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరి షిరీన్, డియన్నా జిజోబీ, ఇంటి సిబ్బంది, ఇతరలకు రతన్ టాటా తన సంపదను పంచిపెట్టారు.
రతన్ టాటా పెంపుడు కుక్క పేరు టీటో. అది జర్మన్ షెపర్డ్ జాతికి చెందినది. అంతకు ముందు ఉన్న శునకం చనిపోవడంతో.. ఆరేళ్ల క్రితం టీటోను తెచ్చుకున్నారు. ఇంట్లో ఎన్నో ఏళ్లుగా వంట మనిషిగా చేస్తున్న రాజన్ షా .. ఇక నుంచి ఆ కుక్క బాగోగులు చూసుకోనున్నారు. దీని కోసం కూడా భారీ స్థాయిలో సంపదను రాసిచ్చారు రతన్ టాటా. టాటా సంస్థలో మూడు దశాబ్ధాలుగా పనిచేస్తున్న బట్లర్ సుబ్బయ్యకు కూడా తన వీలునామాలో రతన్ టాటా కొంత రాసిచ్చారు.
రతన్ టాటా ఆస్తుల్లో .. అలీబాగ్‌లో ఉన్న రెండువేల చదరపు అడుగుల బిల్డింగ్ ఉన్నది. ముంబైలోని జూహూ తారా రోడ్డులోని రెండు అంతస్తుల బిల్డింగ్, రూ.350 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో 0.83 శాతం షేర్ ఉన్నాయి. అయితే వీలునామా ప్రకారం.. టాటా సన్స్‌లో ఉన్న షేర్లు.. టాటా ఫౌండేషన్‌కు మార్చబడుతాయి. టాటా గ్రూపు, టాటా మోటార్స్‌లో ఉన్న షేర్లు కూడా రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్‌కు వెళ్తాయి.
రతన్ టాటాకు చెందిన సుమారు 30 కార్ల భవిష్యత్తుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. టాటా సెంట్రల్ ఆర్కివ్స్ లో వాటిని ప్రదర్శించే ఆలోచనలో ఉన్నారు. హలక్కాయి రెసిడెన్స్, తాజ్ వెల్లింగ్టన్ మీవ్స్ నివాసాల్లో ప్రస్తుతం కార్లు ఉన్నాయి. టాటాకు వచ్చిన అవార్డులను పుణె మ్యూజియంకు తరలించనున్నారు. 86 ఏళ్ల రతన్ టాటా.. అక్టోబర్ 9వ తేదీన ముంబైలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.