న్యూఢిల్లీ, జూలై 14: క్రిప్టోకరెన్సీ పేరుతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేసిన హైదరాబాద్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ అఖిలేశ్వర్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ద్వారకా డీసీపీ అకింత్ సింగ్ చెప్పారు. క్రిప్టోకరెన్సీ కొనుగోలు, అమ్మకం ద్వారా భారీ మొత్తంలో ఆదాయముంటుందని, తన నుంచి రూ.20.16 లక్షలు పెట్టుబడిగా తీసుకుని మోసం చేశారని ఢిల్లీలోని ద్వారకకు చెందిన అక్షయ్‌కుమార్ సింగ్ నేషనల్ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు.. నిందితులు హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించారు.
ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీరులోని కేరన్ సెక్టర్లో ఆదివారం ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు వీరు చేసిన ప్రయత్నాలను విఫలం చేసింది. వీరి వద్ద నుంచి ఆయుధాలను, యుద్ధ సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. ఉగ్రవాదుల చొరబాట్ల నిరోధక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు వివరించింది.