న్యూఢిల్లీ, నవంబర్ 16: ఏడాది కాల వ్యవధితో కూడిన మాస్టర్స్ డిగ్రీ (పీజీ) కోర్సులను ప్రవేశపెట్టబోతున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా తెలిపింది. ప్రపంచంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని, కొత్త సబ్జెక్ట్‌తో (యూజీలో మెయిన్ సబ్జెక్ట్ కానవసరం లేదు)..‘వన్ ఇయర్ పీజీ’ కోర్సు చదివే అవకాశం కల్పిస్తున్నట్టు యూజీసీ పేర్కొన్నది. ఇందుకు సంబంధించి పీజీ కోర్సుల పాఠ్య ప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను నవంబర్ 3నాటి సమావేశంలో ఆమోదించినట్టు యూజీసీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
నూతన గైడ్‌లైన్స్‌పై వివిధ వర్గాలు, పౌరుల నుంచి అభిప్రాయం సేకరిస్తామని తెలిపింది. 4 ఏండ్ల యూజీ, 5 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్)కోర్సు, 3 ఏండ్ల యూజీతోపాటు 2 ఏండ్ల మాస్టర్స్ చదివినవారు.. ఎంఈ, ఎంటెక్‌లలో ‘వన్ ఇయర్ పీజీ’ చేసేందుకు అర్హులవుతారని యూజీసీ పేర్కొన్నది. ‘ఈ తరహా నిబంధనలతో పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం దేశంలో ఇదే మొదటిసారి’ అని యూజీసీ చైర్పర్సన్ ఎం జగదీశ్‌కుమార్ అన్నారు. ఏడాది కాలపరిమితితో కూడిన ఎంఏ ప్రోగ్రాంను కూడా తీసుకొచ్చే ఉద్దేశముందని అన్నారు.