ముంబై: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ఉద్దవ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించిందని, పైగా దహీ హండి, గణేత్సవ్ లాంటి కార్యక్రమాల్లో గుంపులుగా చేరకుండా సామాజిక దూరం పాటించాలని సూచించిందని ఉద్దవ్ థాకరే గుర్తుచేశారు. ఇదే విషయమై అన్ని రాష్ట్రాలతోపాటు తమకు కూడా కేంద్ర సర్కారు లేఖ రాసిందని చెప్పారు.
ఇప్పుడు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై గుంపులుగా చేరి నిరసన ప్రదర్శలు చేస్తున్నారని, వారికి ఇటీవల కేంద్ర ప్రభత్వం రాసిన లేఖను తప్పక చూపించాలని ఎద్దేవా చేశారు. బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రలను ఉద్దేశించి.. కొంత మంది యాత్రలు చేస్తుండటం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యాత్రల పేరుతో వాళ్లు సామాన్యుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఉద్దవ్ థాకరే విమర్శించారు.