న్యూఢిల్లీ, మార్చి 8: తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ సహా 23 మంది రచయితలు, కవులు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024ను అందుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సాహిత్యోత్సవంలో భాగంగా శనివారం ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద విజేతలకు లక్ష రూపాయల నగదుతో పాటు పత్రం, శాలువను బహూకరించారు. నిరుడు డిసెంబర్లో ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగులో పెనుగొండ లక్ష్మీనారాయణ రచించిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి సాహిత్య విమర్శ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించిన పెనుగొండ లక్ష్మీనారాయణ వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ రచయితగా పేరొందారు. 1954లో చెరువుకొమ్ముపాలెం గ్రామంలో పుట్టిన ఈయన 1972 నుంచి రచనలు చేయడం ప్రారంభించారు. పలు పుస్తకాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించడమే కాక, 100కు పైగా పుస్తకాలకు సహ-సంపాదకుడు, గౌరవ సంపాదకునిగా వ్యవహరించారు.