Pawan Khera : కాషాయ పాలకులు యువత జీవితాలను నాశనం చేశారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. నిరుద్యోగం పెచ్చుమీరుతున్నా బీజేపీ నేతలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు.
ఢిల్లీలో పవన్ ఖేరా సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీజేపీ తీరును తప్పుపట్టారు. గణాంకాలు స్పష్టంగా దేశ ప్రజల ముందున్నాయని, మీరు వీటిని చూడలేదా అని కాషాయ పాలకులను పవన్ ఖేరా ప్రశ్నించారు. ఈ గణాంకాలతో మీకెందుకు ఉలుకని నిలదీశారు. నిరుద్యోగ తీవ్రత గురించి డేటా ఆధారంగా రాహుల్ మాట్లాడటంలో తప్పేముందని అన్నారు.
నిరుద్యోగం ఎందుకు పెరిగిందో అధికారంలో ఉన్న మీరు వివరణ ఇవ్వాలని నిలదీశారు. మీరు యువత జీవితాలను నాశనం చేస్తుంటే దానిపై మాట్లాడటంలో తప్పేముందని, తాము తప్పకుండా ఈ విషయం చర్చిస్తామని పవన్ ఖేరా స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరెస్సెస్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ భారత్ ఒకే ఆలోచనకు సంబంధించిందని ఆరెస్సెస్ భావిస్తుందని, కానీ తాము భారత్ విభిన్న ఆలోచనలకు వేదికగా భావిస్తామని చెప్పుకొచ్చారు.
Read More :
Vatpalli SI Transfer | బర్త్‌డే ఎఫెక్ట్..వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్‌పై బదిలీ వేటు