కోల్‌కతా : ఆర్జీ కర్ దవాఖానలో పీజీటీ వైద్యురాలిపై హత్యాచారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్లో మరో దుర్ఘటన జరిగింది. బీర్భూమ్లోని ఇలంబజార్ ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న నర్స్పై రోగి దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కథనం ప్రకారం, ఆమె ఈ దవాఖానలోని ఎమర్జెన్సీ వార్డులో శనివారం రాత్రి సేవలందిస్తున్నారు. డాక్టర్ సూచనల మేరకు ఓ రోగికి స్లైన్ పెట్టేందుకు వెళ్లారు.
ఆమె ఆ రోగికి స్లైన్ పెడుతుండగా, ఆయన ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను అనుచితంగా తాకాడు. మాటలతో దూషించాడు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నప్పటికీ, ఆయనను నిలువరించే ప్రయత్నం చేయలేదు. భద్రత లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న దవాఖాన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
బెంగాల్‌లోని హౌరాలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ అత్యంత నీచానికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల బాలిక ఓ దవాఖానలో నిమోనియాకు చికిత్స పొందుతున్నది. ఆమెను శనివారం రాత్రి సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లగా ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడు ఈ దవాఖానలో కాంట్రాక్టుపై ఉద్యోగం చేస్తున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.