న్యూఢిల్లీ, జూన్ 25 : భారతదేశమంతా ఇప్పుడు పాస్‌పోర్ట్‌పైనే చర్చ జరుగుతున్నది. 14వ పాస్‌పోర్ట్ సేవాదినం సందర్భంగా పాస్‌పోర్టు పౌరసత్వానికి గుర్తింపు కాదని బుధవారం విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పడంతో దుమారం మొదలైంది. అది కేవలం వ్యక్తులు విదేశాలకు వెళ్లడానికి ఉపయోగపడేదే తప్ప.. పౌరసత్వానికి నిదర్శనం కాదని విదేశాంగ శాఖ వెల్లడించింది. అప్పటి నుండి పాస్‌పోర్ట్ దేనికి ప్రతీక అని, అది కేవలం ఒక ప్రయాణ పత్రం అయితే దానికి ఎందుకంత పరిశీలన అవసరమని చర్చిస్తూ ప్రజలు సోషల్ మీడియా వేదికలను ముంచెత్తారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత పౌరసత్వాన్ని నిరూపించుకొనే పత్రాలు ఏవని ప్రశ్నిస్తున్నాయి. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ తన పోస్టులో.. ‘పాస్పోర్ట్ట్ కేవలం ప్రయాణాలకు సంబంధించిన పత్రం అని విదేశాంగశాఖ చెబుతున్నది. అదే నిజమైతే.. ఒక వ్యక్తి భారతీయ పౌరుడేనని తెలుసుకోకుండానే ఈ పత్రాన్ని జారీ చేస్తున్నారా.. ఇది చాలా విడ్డూరంగా ఉంది’ అని సెటైర్ వేశారు.
అయితే విదేశాంగ శాఖ అధికారి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేవి కావు. పాస్పోర్ట్ట్ అనేది ప్రధానంగా ఒక దేశం తన సొంత పౌరులకు జారీ చేసే గుర్తింపు, ప్రయాణ పత్రం అని ప్రభుత్వ పాస్‌పోర్టు నియమావళి పేర్కొంటోంది. అంతేగాకుండా దీనికి సంబంధించి న్యాయస్థానాల తీర్పులు కూడా ఉన్నాయి. ఇంతటి గందరగోళానికి కారణం స్పష్టం. విస్తృతమైన పత్రాల పని, పాస్‌పోర్టు సేవా కేంద్రాల వద్ద క్యూలలో నిలబడటం, పోలీస్ వెరిఫికేషన్, ఫీజుల చెల్లింపు వరకు భారతీయ పాస్‌పోర్టు పొందడం అనేది ఒక సుదీర్ఘ, కష్టతరమైన ప్రక్రియ. విదేశాల్లో ఉన్న భారతీయుల జాతీయతను పాస్‌పోర్టు ధృవీకరిస్తుందే తప్ప అది పౌరసత్వానికి సంబంధించిన పత్రం కాదని అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. వాస్తవానికి పాస్‌పోర్టు అనేది ఎప్పుడూ పౌరసత్వాన్ని నిరూపించే పత్రం కాదు. అలా అయితే, పౌరసత్వానికి ఏ పత్రం రుజువు? అని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం మొదలు పెట్టడంతో విదేశీ వ్యవహారాల శాఖ అధికారి చేసిన ఈ వ్యాఖ్య చర్చనీయాంశమైంది.
పాస్‌పోర్టు దరఖాస్తుదారు గుర్తింపు, చిరునామా, నేపథ్యాన్ని నిర్ధారించడం పోలీసు ధృవీకరణ ప్రధాన ఉద్దేశం. మోసపూరిత దరఖాస్తులను గుర్తించడం, నకిలీ గుర్తింపులను నివారించడం, నేర చరిత్రను పరిశీలించడం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులకు పాస్‌పోర్టులు జారీ కాకుండా చూడటం వంటి వాటికి ఇది సహాయపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. విస్తృతమైన పేపర్ వర్క్, ధృవీకరణ తనిఖీలు, అధికారిక అడ్డంకుల చిక్కుముడిని దాటిన తర్వాత అధికారుల స్పష్టీకరణల ప్రకారం దరఖాస్తుదారుడు చివరకు కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమే పొందగలుగుతాడు. అయితే ఆధార్ లేదా పాన్ మాదిరిగా కాకుండా పాస్‌పోర్టును భారత ప్రభుత్వం ఒక సార్వభౌమ పత్రంగా పరిగణిస్తుంది. 1967 నాటి పాస్పోర్ట్సు చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఆ చట్టం కింద జారీ చేసిన ప్రతి పాస్‌పోర్ట్ ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. పాస్పోర్ట్ట్ అనేది అంతర్జాతీయంగా భారతదేశాన్ని ప్రతిబింబిస్తుందన్నది ప్రభుత్వ వాదన. పాస్‌పోర్టును ఉపసంహరించుకోవడం, స్వాధీనం చేసుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాబట్టి దాని యాజమాన్యం ప్రభుత్వం వద్దే ఉంటుంది.
భారతదేశంలో ప్రతి పరిస్థితిలోనూ పౌరసత్వాన్ని నిశ్చయంగా నిరూపించే సార్వజనికంగా ఆమోదించే ఒక పత్రం కూడా లేదు. పౌరసత్వం అనేది పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం జననం, వంశపారంపర్యం, నమోదు, సహజ సిద్ధీకరణ లేదా భూభాగ విలీనం ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ చట్టానికే నాలుగుసార్లు సవరణలు జరిగాయి. అక్రమ వలసలను తగ్గించడానికి 1986లో చేసిన సవరణ ప్రకారం పుట్టుకతో వచ్చే కఠినమైన పౌరసత్వాన్ని తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారత పౌరుడై ఉండాలనే నిబంధనను మార్చారు. అప్ఘ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లో హింసకు గురైన మైనారిటీల పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయడానికి తాజా పౌరసత్వ(సవరణ) చట్టం, 2019 నిబంధనలు చేసింది. ఇటీవల ధృవీకరణ కార్యక్రమాలలో అధికారిక పనుల కోసం, కోర్టు విచారణల కోసం కోరే పత్రాలలో చూసినట్లుగా లక్షలాది మంది భారతీయులు సాధారణంగా తమ వద్ద ఉంచుకునే ఆధార్, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు, పాస్‌పోర్టులు వంటి పత్రాలను పౌరసత్వ రుజువుగా ఉపయోగించవచ్చు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో వాస్తవం విస్మయానికి గురి చేస్తుంది. పౌరసత్వానికి విశ్వవ్యాప్తమైన రుజువుగా పనిచేసే ఏకైక పత్రం ఏదీ లేదు.
పాస్పోర్ట్ట్ అనేది ప్రయాణ పత్రం మాత్రమే. పౌరసత్వానికి సంబంధించిన పత్రం కాదు. మరి పౌరసత్వానికి నిదర్శనమైన పత్రం ఏది?అని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ కారణంతో బీఎల్వో తన పౌరసత్వంపై అనుమానం వ్యక్తం చేయొచ్చని&. తన ఓటు తొలగించవచ్చని.. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రక్రియలో బీజేపీ మళ్లీ గెలుస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. శివసేన కీలక నేత ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. ‘పాస్‌పోర్టు పౌరసత్వానికి గుర్తింపు కాదని విదేశాంగ శాఖ చెబుతోంది. మరి పాస్‌పోర్టు జారీ చేసే ముందు పోలీసులు ఏం ధృవీకరిస్తున్నారు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం భారతీయులు కానివారికి కూడా పాస్‌పోర్టులు జారీ చేస్తుందా? విదేశాంగ శాఖ ప్రకటన భారతీయులు కానివారికి కూడా పాస్‌పోర్టులు ఇస్తుందా అనే సందేహాన్ని అనేక దేశాల్లో రేకెత్తిస్తోంది. ఇంతకంటే దారుణంగా విదేశాంగ శాఖ వ్యవహరించదేమో’ అని ఎద్దేవా చేశారు.
ఈ ప్రశ్నలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి, గతంలో విదేశాంగశాఖ కార్యదర్శిగా పనిచేసిన నిరుపమ మీనన్ రావు స్పందించారు. ‘విదేశాంగశాఖ ప్రకటన సబబే. ఎందుకంటే పాస్‌పోర్టు అనేది పాస్‌పోర్టు చట్టం కింద జారీ చేస్తారు. పౌరసత్వం అనేది పౌరసత్వ చట్టం 1955 ప్రకారం జారీ చేస్తారు. రెండు చట్టాలు వేర్వేరు. పాస్పోర్ట్ట్ మీద ఇండియా అనే పేరు ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అడ్డుకోరు. కానీ పాస్‌పోర్టు అనేది పౌరసత్వానికి సాక్ష్యం కాదు. చట్టబద్ధంగా పౌరసత్వం పొందడం లాంటిది చేసినప్పుడు పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను వెరిఫై చేస్తారు’ అంటూ తెలిపారు.
పాస్‌పోర్ట్- పౌరసత్వ అంశంపై రాజకీయ వివాదం నెలకొన్న తరుణంలో ప్రయాణపు పత్రమైన (ట్రావెల్ డాక్యుమెంట్) పాస్‌పోర్ట్‌కు సంబంధించి గత 12 ఏండ్లలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ప్రతిపక్షాలు ‘అధికార పక్షంతో విభేదించేవారి పౌరసత్వ హక్కులను ఏకపక్షంగా తిరస్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపించాయి. కాగా 1967 నాటి పాస్‌పోర్ట్ చట్టాన్ని అనుసరించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారతీయులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్ జారీ చేయవ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఓటర్ల జాబితాలో తమ అర్హత చెల్లుబాటు అయ్యే పత్రాల్లో పాస్‌పోర్ట్ ఒకటిగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం(ఈసీ) పేర్కొంది. ‘పాస్‌పోర్ట్ పౌరసత్వ నిరూపణ పత్రం కాదనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ప్రధాని మోదీ అధికారంలో ఉన్న గత 12 ఏండ్లలో కూడా దీనిపై ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.