గౌహతి: అస్సాంను వరదలు ముంచెత్తాయి. శనివారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురియడంతో పలు జిల్లాలు వరదమయ మయ్యాయి. వందకుపైగా గ్రామాలు నీట మునిగాయి. పలు రైల్వే ట్రాక్‌లు, రైల్వే స్టేషన్లకు నష్టం వాటిల్లింది. రెండు రైళ్లు మార్గమధ్యలో నిలిచిపోయినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్వో సబ్యసాచి తెలిపారు. నిలిచిపోయిన రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. పలు రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. రైల్వే సేవల పునరుద్ధరణ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.
మరోవైపు భారీ వరదలతోపాటు రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పలు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. ప్రధానంగా దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొంచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లకు నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. వాహనాల రవాణాకు కూడా ఆటంకం కలిగింది. వరదల ధాటికి హాఫ్లాంగ్ ప్రాంతంలో ముగ్గురు మృతి చెందగా, 80 ఇండ్లు దెబ్బతిన్నాయి.