న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దిమాపూర్ వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Plane) పెను ప్రమాదం తప్పింది. విమానంలోని ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ ఒక్కసారిగా నిప్పంటుకున్నది. అయితే అప్రమత్తమైన సిబ్బంది మంటలను వెంటనే ఆర్పివేశారు. దీంతో విమానంతోపాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆదివారం ఇండిగోకు చెందిన 6ఈ2017 ఎయిర్‌బస్ నియో విమానం ఢిల్లీ నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్ వెళ్తున్నది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు తన ముందు సీటు బ్యాక్ పాక్‌లో పవర్ బ్యాంక్ పెట్టారు. అయితే ఒక్కసారిగా పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో క్యాబిన్ క్య్రూ స్పందించి దానిని వెంటనే ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఇండిగో వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత ఢీల్లీ ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన విమానం.. అవసరమైన అన్ని తనిఖీల తర్వాత గమ్యస్థానానికి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన విమానం.. మధ్యాహ్నం 2.33 గంటలకు బయల్దేరింది. సాయంత్రం 4.45 గంటలకు దిమాపూర్ చేరుకున్నది.