న్యూఢిల్లీ: ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ఆమెతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయిస్తారు. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రావడంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి పీఎం మోదీ సహా, కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
అయితే రేఖ గుప్తాతోపాటు మంత్రులుగా ఎవరైనా ప్రమాణం చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దీనిపై రాష్ట్రపతి భవన్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని తెలిపింది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్ ప్రమాణం చేస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం వెల్లడించింది. వారికి ఏయే శాఖలు కేటాయించారనే విషయం వెల్లడించలేదు. కాగా, సీఎం పదవికి పోటీపడ్డ పర్వేశ్ వర్మ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తున్నది.
షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తా(50)ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, విజేందర్ గుప్తా వంటి వారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ మహిళగా రేఖా గుప్తాకు బీజేపీ అవకాశం కల్పించింది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రుల్లో మహిళలు ఎవరూ లేకపోవడం కూడా ఆమెకు కలిసొచ్చింది.
ఎవరీ రేఖా గుప్తా?
ఢిల్లీకి కాబోతున్న నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మహిళా సీఎంలుగా పని చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి బందన కుమారిపై 29 వేల ఓట్ల భారీ మెజారిటీతో షాలిమార్‌బాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆమెకు ఇదే మొదటిసారి. విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీలో ఆమె చురుగ్గా పని చేశారు.
1996లో ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి ఎస్బీఐ అధికారిగా ఢిల్లీకి బదిలీ కావడంతో రేఖా గుప్తా కుటుంబం ఇక్కడ స్థిరపడింది.