కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ ఆయన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ మధ్య పదేళ్లుగా సంబంధాలున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో తేలింది. అర్పితా ముఖర్జీకి చెందిన 31 జీవిత బీమా పాలసీల్లో నామినీగా పార్థా ఛటర్జీ ఉన్నారని ఈడీ పేర్కొంది. 2012 జనవరి 1న ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ సంస్థను ఏర్పాటు చేసి భాగస్వామ్య డీడ్ రాసుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం వారిద్దరూ కలిసి జాయింట్‌గా పలు ఆస్తులను కొనుగోలు చేశారని చెప్పారు. వీటిలో కొన్ని ఆస్తులను నేరుగా డబ్బులతోనే కొన్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై దర్యాప్తు చేయాల్సి ఉన్నదని తెలిపారు. పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ మధ్య 2012 నుంచే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు.
కాగా, బెంగాల్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు కుంభకోణాలకు పాల్పడినట్లు పార్థా ఛటర్జీపై ఆరోపణలున్నాయి. టీచర్స్ రిక్రూట్మెంట్, బదిలీలు, కాలేజీల అనుమతులు, ఎస్ఎస్ఈ స్కామ్ ద్వారా కోట్లలో ముడుపులు ముట్టాయని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ అధికారులు రూ.49.80 కోట్ల డబ్బులు, రూ.76 లక్షల విలువైన బంగారం, రూ.56 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, పలు ఆస్తుల పత్రాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి ఈడీ కస్టడీని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది.