Adhir Ranjan Chowdary – Mamata Benargee | లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి రియాక్టయ్యారు. ఆమె వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవన్నారు. మమతా బెనర్జీ ఏనాడో కూటమిని వదిలేశారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్ పార్టీతో విభేదాలు పొడసూపడంతో ఇండియా కూటమికి మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు.
తాజాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బయటి నుంచి మద్దతు ఇస్తామన్న దీదీ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ..‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడానికి విపక్ష ‘ఇండియా’ కూటమి ముందుకు సాగుతున్నది. కూటమి లోపల లేదా బయట ఉండి మమతా బెనర్జీ ఏంచేస్తారో తెలియదు. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాలి. పూర్తిగా ఇండియా కూటమిని మమతా బెనర్జీ విడిచిపెట్టి బీజేపీతో జట్టు కట్టేందుకు అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలూ గెలుచుకోవడం కష్టం అని బీజేపీ చెబుతున్నది. మమతా బెనర్జీ మాత్రం ఇండియా కూటమి అధికారంలోకి రావడం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ ఓటమి ఖాయమని గ్రహించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు’ అని అన్నారు.