Parliament | జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం, ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిందని.. డిసెంబర్ 8న సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి లోక్‌సభలో వందే మాతరం వార్షికోత్సవంపై, డిసెంబర్ 9న మంగళవారం ఉదయం 12 గంటల నుంచి సర్ అంశంపై చర్చ నిర్ణయించినట్లు కేంద్రమంత్రి సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు. 8న లోక్‌సభలో వందేమాతరంపై వివరణాత్మక చర్చ నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించిందని, ఇందు కోసం పదిగంటల సమయం కేటాయించారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక చర్చను ప్రారంభిస్తారన్నారు. అదే సమయంలో రేపటి నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఎలాంటి అంతరాయం లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలని ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. పార్టీలు సభ కార్యకలాపాలను సావుగా సాగేందుకు అంగీకరించాయని.. తీవ్రమైన అంశాలపై దృష్టి సారించినట్లుగా చెప్పారు. 9-10 తేదీల్లో సర్ అంశంపై చర్చ జరుగుతుందని.. ఇందుకు పది గంటల సమయం కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ ఈ అంశంపై అభిప్రాయాలను చెబుతాయన్నారు. చర్చ పూర్తయ్యాక డిసెంబర్ 10న కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందిస్తారన్నారు. డిసెంబర్ ఒకటిన మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయి. 15 రోజుల పాటు జరుగనున్నాయి. తొలి రెండురోజులు పార్లమెంట్ ఉభయ సభలు గందరగోళం నెలకొంది.