PM Modi | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): మణిపూర్ సంక్షోభం, హింస నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం పరనింద.. ఆత్మస్తుతిగా సాగింది. తన ప్రసంగంలో ప్రధాని విపక్ష కూటమి, అందులోనూ ప్రధానంగా కాంగ్రెస్‌నే టార్గెట్‌గా చేసుకొని ప్రసంగించడంతో మధ్యలోనే విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం మోదీ మణిపూర్ అంశంపై ముక్తసరిగా మాట్లాడి ప్రసంగాన్ని ముగించారు. చర్చ సందర్భంగా మూజువాణి పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తూ దశాబ్దాల కిందట కాంగ్రెస్ పాలనలో ఈశాన్య భారతంలో ఏం జరిగిందో గత చరిత్రను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగారు. తొమ్మిదేండ్లుగా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. తన ప్రసంగంలో అహంకారం అనే పదానికి పర్యాయపదమైన గమండ్ అనే పదాన్ని పలుమార్లు ఉపయోగించారు. మణిపూర్ ప్రజలకు ఎలాంటి శాంతి సందేశం ఇవ్వలేదు. మణిపూర్‌లో అరాచకం సృష్టిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని మాత్రం తెలిపారు. మరోవైపు మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించడాన్ని ఖండించకపోగా, అలాంటి ఘటనలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జరుగలేదా? అంటూ ప్రధాని సమాధానానికి ముందు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగారు.
1999లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి అవిశ్వాసాన్ని తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని చెబుతారు. తనపై సోనియా గాంధీ చేసిన విమర్శలకు ఆయన స్పందిస్తూ తనను తిట్టడానికి పదాల కోసం డిక్షనరీలను వెతికారా? అంటూ సుతిమెత్తగా చురక అంటించారే తప్ప మోదీ లాప్రతిపక్షంపై దూషణకు దిగకుండా హుందాగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు గుర్తుకు చేసుకున్నారు.
మణిపూర్ ఘటనపై సభలో అవిశ్వాస తీర్మానం పెడితే, దానిని కాంగ్రెస్ బలాబలాలపై జరిగిన చర్చగా ప్రధాని మార్చారు. యూపీ, బీహార్, గుజరాత్ రాష్ర్టాలలో దశాబ్దాల తరబడిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని, అలాగే తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేడని ఎద్దేవా చేశారు. ఒడిశా, త్రిఫుర, నాగాలాండ్ రాష్ర్టాలలో కాంగ్రెస్ ఎన్ని ఏండ్ల నుంచి అధికారంలోకి రాలేదో లెక్కలతో సహా వివరిస్తూ చర్చను పక్కదోవ పట్టించారు.