Parliament : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు (Opposition leader), కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఈ నెల 19న తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ హౌస్ అన్నెక్సేలో ఈ భేటీ జరగనుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు, రైతులకు కనీస మద్దతు ధర, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. గౌతమ్ అదానీ అంశం, రైతులకు కనీస మద్దతు ధర తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలు వాయిదాపడుతూ వచ్చాయి. చివరకు ఈ నెల 13, 14 తేదీల్లో లోక్‌సభలో, ఈ నెల 16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఉభయసభల్లో వాడీవేడి చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని దేశ పరిస్థితులకు అనుకూలంగా మార్చకుండా కాంగ్రెస్ పాలకులు వందలకొద్ది సవరణలు చేస్తూ వచ్చారని ప్రభుత్వం విమర్శించింది. దేశంలో కోసం ఇంతవరకు ఏమీ చేయని బీజేపీ మాకు రాజ్యాంగం గురించి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
ఈ క్రమంలో ఈ నెల 19న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్యాంగంపై చర్చ జరిగిన రెండు రోజులు మినహా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇంతవరకు ఉభయసభలు సజావుగా సాగలేదు. ఇకముందైనా సభాకార్యకలాపాలు సజావుగా సాగుతాయా లేదా..? అనేది అనుమానంగా ఉన్నది.