Mahua Moitra | పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని, అలాగే ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. ఎంపీకి నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు అక్టోబర్ 31న విచారణకు రావాలని నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
ముందస్తుగా ఉన్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. అయితే, ఆమె 2న సైతం విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నాల్గో తేదీ వరకు తాను బిజీగా ఉంటానని.. 5వ తేదీ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరువుతానని శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ లాగిన్, పాస్వర్డ్ వివరాలను వ్యాపారవేత్త హీరానందానికి ఇచ్చినట్లు ఎంపీ ఒప్పుకున్నారు.
అయితే, ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఆమె ఖండించారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసీకి ఇందుకు వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని స్పష్టం చేశారు. హీరానందాని తన స్నేహితుడని.. అతని నుంచి గిఫ్ట్‌లు సైతం అందుకున్నట్లు తెలిపారు. తన పుట్టిన రోజున స్కార్ఫ్, లిప్‌స్టిక్, మేకప్ ఐటెమ్స్ గిఫ్ట్ అందుకున్నట్లు పేర్కొన్నారు. హీరానందాని తనకు డబ్బులు ఏవైనా ఇచ్చి ఉంటే.. ఆ వివరాలను వెల్లడించాలని కోరారు.
అఫిడవిట్లో తనకు రూ.2కోట్లు ఇచ్చినట్లుగా లేదని.. ఒక వేళ డబ్బు ఇస్తే.. ఇచ్చిన తేదీ.. అందుకు సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఎంపీ మహువాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది. ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు ఆయన న్యాయవాదిని సైతం విచారణ జరిపి.. వాంగ్మూలాలను నమోదు చేసింది.