మొహాలీ: పార్కింగ్ ఘర్షణ(Parking Dispute)లో ఓ యువ శాస్త్రవేత్త మృతిచెందాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న 39 ఏళ్ల డాక్టర్ అభిషేక్ స్వర్ణకార్ ప్రాణాలు కోల్పోయాడు. సెక్టార్ 67లో తన కిరాయి ఇంటి వద్ద పార్కింగ్ వివాదం చెలరేగింది. పక్కింటి వారితో గొడవ తలెత్తడంతో.. మాంటీ అనే వ్యక్తి దాడికి దిగాడు. అభిషేక్‌ను కిందపడేసి పంచ్‌లు విసిరాడు.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన డాక్టర్ స్వర్ణకార్.. అంతర్జాతీయ జర్నల్స్‌కు అనేక వ్యాసాలు రాశాడు. అతను స్విట్జర్లాండ్‌లో పనిచేశాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన అతను.. ఐఐఎస్ఈఆర్లో ప్రాజెక్టు శాస్త్రవేత్తగా చేరాడు. అయితే విషాదకరమైన అంశం ఏంటంటే, ఆ శాస్త్రవేత్త ఇటీవల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. అతని సోదరి కిడ్నీ దానం చేసింది. ప్రస్తుతం డాక్టర్ అభిషేక్ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. దాడి జరిగిన వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మరణించినట్లు తేల్చారు.
దాడి జరిగిన సమయంలో కొందరు స్థానికులు ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. టూ వీలర్ పార్కింగ్ వద్ద వాగ్వాదం జరగడంతో.. మాంటీ అనే వ్యక్తి దాడి చేశాడు. పొరుగింటి వాళ్లు వచ్చి రక్షించేలోగా అభిషేక్ కిందపడిపోయాడు. పార్కింగ్ వివాదానికి శాస్త్రవేత్త బలయ్యాడు.