Paracetamol | కేంద్ర ప్రభుత్వం పారాసెటమాల్‌పై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు విస్తృతంగా ఉపయోగించే ఈ ఔషధం నిషేధించబడిందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ విషయమై వివరణ ఇచ్చారు. పారాసెటమాల్‌ను నిషేధించినట్లు తమ దృష్టికి ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం తెలిపిందని ఆమె పేర్కొన్నారు. అయితే, పారాసెటమాల్‌ను ఇతర ఔషధాలతో కలిపి తయారు చేసిన కొన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను గతంలో నిషేధించినట్లు గుర్తు చేశారు. కానీ, పారాసెటమాల్ మాత్రలపై ఎలాంటి ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలవుతున్న ఉచిత మందుల పంపిణీ పథకాన్ని గురించి మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందే ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం అమలులో ఉన్నదని ఆమె తెలిపారు. అత్యవసర ఔషధాలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. ఈ నిధులను మందుల కొనుగోలు, నాణ్యత నియంత్రణ, సరఫరా వ్యవస్థ నిర్వహణ, గిడ్డంగుల ఏర్పాటుకు వినియోగిస్తున్నట్టు ఆమె చెప్పారు. మందుల లభ్యతను పర్యవేక్షించేందుకు డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రత్యేక ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాక, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాల్సిన అత్యవసర ఔషధాల జాబితాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిందని తెలిపారు. ఈ మందుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు మెడికల్ స్టోర్స్ ఆర్గనైజేషన్ 697 రకాల ఔషధాలకు రేట్ కాంట్రాక్టులను కలిగి ఉందని ఆమె వివరించారు.