పట్నా : కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పేరుతో నాసి రకం బియ్యాన్ని పంపిణీ చేస్తోందని జన్ అధికార్ పార్టీ చీఫ్ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. పీఎంజీకేఏవై లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న నాసిరకం బియ్యం ఫోటోలను పప్పు యాదవ్ ట్వీట్ చేశారు. మోదీజీ మీరు రూ లక్షల విలువైన పుట్టగొడుగులను తినడం మాని ఐదు రోజులు ఈ బియ్యం తినండి అంటూ ఈ ఫోటోకి ఆయన క్యాప్షన్ జత చేశారు.
అన్న మహోత్సవ పేరుతో ఇలాంటి 5 కిలోల నాసిరకం ఆహార ధాన్యాలను ప్రజలకు పంచడం మీకు సిగ్గనిపించడం లేదా అని ప్రధాని మోదీని ఆయన నిలదీశారు. ఇక ఈ నెల 5న ప్రధాని మోదీ యూపీ, బిహార్‌లకు చెందిన పలువురు పీఎంజీకేఏవై లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ను అందిస్తున్నామని చెప్పారు.