పానీపట్ : ‘నా కంటే అందంగా ఉన్న ఎవరినీ బతకనీయను’ అంటూ నలుగురు చిన్నారులను నీటిలో ముంచి హత్య చేసిన ఒక మహిళను హర్యానా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తాజాగా ఒక వివాహ వేడుకలో ఆరేండ్ల చిన్నారిని నీట ముంచి చంపిన హర్యానాలోని సోనిపట్ జిల్లా భవాడ్ గ్రామానికి చెందిన సోనమ్ చెప్పిన వివరాలు విని పోలీసులు విస్తుపోయారు. గత రెండేండ్లుగా మరో ముగ్గురు చిన్నారులను తాను ఇదే తరహాలో హత్య చేసిన విషయాన్ని ఆమె వెల్లడించింది. అలా తన చేతిలో హతమైన వారిలో ఆమె కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే ఆమె వెల్లడించే వరకు అంతకు ముందు మరణించిన ముగ్గురు చిన్నారులు కూడా ప్రమాదవశాత్తు మరణించినట్టు పోలీసులు, బంధువులు భావించడం గమనార్హం. సోమవారం పానిపట్‌లోని ఒక వివాహానికి వచ్చిన సోనమ్ అందరూ వివాహ వేడుకల్లో ఉండగా, తనకు మేనకోడలు అయ్యే బాలిక(6)ను నీటి తొట్టెలో ముంచి హత్య చేసింది. అనుమానంతో పోలీసులు ఆమెను విచారించగా, అంతకు ముందు కూడా తాను అదే తరహాలో హత్యలు చేసిన విషయాన్ని వెల్లడించింది. 2023లో తన వదిన కుమార్తెను ఇలాగే నీట ముంచి చంపుతుండగా, దానిని ఆరేండ్ల కుమారుడు చూడటంతో అతడిని కూడా అదే తరహాలో హతమార్చింది.