పాట్నా: పార్కింగ్ వివాదం నేపథ్యంలో కారులో ఉన్న వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్న ఏడీజీ సెక్యూరిటీ గార్డు కూడా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పులకు స్థానికులు భయాందోళన చెందారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం బోరింగ్ కెనాల్ రోడ్డు ప్రాంతంలో పార్కింగ్ విషయంపై వివాదం జరిగింది. దీంతో ఎస్‌యూవీలో ఉన్న వ్యక్తులు గాలిలోకి కాల్పులు జరిపారు.
కాగా, శాంతిభద్రతల అదనపు ఏడీజీ పంకజ్ దరాద్ ఆ సమయంలో సమావేశం నుంచి తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల శబ్దం విన్న వెంటనే ఆయన అలెర్ట్ అయ్యారు. ఆ ప్రాంత పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఏడీజీ సెక్యూరిటీ కూడా గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో గాలిలోకి కాల్పులు జరిపిన వాహనంలోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఆ ప్రాంతంలో భయాందోళనలు రేపిన ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత నంబర్ ప్లేట్ లేని వాహనంలో పారిపోయిన వారి కోసం వెతుకుతున్నారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్‌లో సహా ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నట్లు పోలీస్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.