న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు చెప్పలేదు. ప్రజా ప్రయోజనాలపై చర్చలు జరపలేదు. బడ్జెట్ పద్దులపై వివరణలు ఇవ్వలేదు. సభ్యుల డిమాండ్లకు స్పందించలేదు. కానీ, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 1952 తర్వాత అతి తక్కువ కాలం జరిగిన ఆరో బడ్జెట్ సమావేశాలు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి.
అయితే, షెడ్యూల్ సమయంలో లోక్సభ కేవలం 33 శాతం(46 గంటలు), రాజ్యసభ 24 శాతం(32) గంటలు మాత్రమే నడిచాయి. 15 రోజుల పాటు జరిగిన రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అయితే షెడ్యూల్ సమయంలో లోక్సభ కేవలం 5 శాతం, రాజ్యసభ 6 శాతం సమయం మాత్రమే నడిచాయి. ఈ బడ్జెట్ సెషన్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టగా ఇందులో ఫైనాన్స్ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించారు. మరో బిల్లును జేపీసీకి పంపించగా ఇంకో బిల్లును ఆమోదించారు.